Teluguvaani | A monthly Telugu magazine
TeluguVani
కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ వుంటాయి –భైరన్

భిన్నమైన భావాలు


ముందుగా, ఇక్కడ చర్చించిన విషయాలు ఎవరినీ నొప్పించుటకు, ఎవరి అభిప్రాయాలను కించ పరుచుటకు ఉద్దేశించినవి కావు. దీనివలన ఎవరికైనా మానసికంగా ఇబ్బంది కలిగివుంటే క్షమించ మని మనవి. ఇవి పూర్తిగా నా అభిప్రాయాలు మాత్రమే.

మొన్న ఈ మధ్యన ఒక చిన్న పాటల పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంటే, ఒక చిన్నారి పాప "గోదావరి" చిత్రం లో "రామ చక్కని సీతకి” అంటూ చాలా శ్రావ్యంగా పాడుతుంటే ఎంతో ముద్దు వచ్చింది. అపుడే మన తెలుగు పాటలలోని సాహిత్యం మీద చిన్న వ్యాసం వ్రాయాలని అనిపించిది.

రెండో చరణము లో ఆ పాట సాహిత్యం ఇలా ఉంది.
ఎడమ చేతితో శివుని విల్లుని ఎత్తినా రాముడు
ఎత్త గలడా సీత జడని తాళి కట్టే వేళలో?

నాకో సందేహం? తాళి కట్టే సమయములో, పెళ్లి కూతురి జడని ఎత్తి పెట్టేది, పెళ్లి కూతురి తల్లి, లేక పోతే పెళ్లి కూతురి స్నేహితురాళ్ళు.  అది కాకుండా, పెళ్లి కొడుకు జడని ఎత్తడు, ఎందుకంటే, మూడు ముళ్ళు వెయ్యడానికి రెండు చేతులు కావాలి కదా? జడ ఎత్తడానికి మూడో చెయ్యి కావాలి.

అదే పాట ఇలాగ కొనసాగుతుంది.
నల్ల పూసయి నాడు దేవుడు నల్లని రఘు రాముడు
చివరగా
ఇందు వదనం కుంద రదనం మంద గమనం రామ!
కుంద రదనము అంటే "బంగారం వంటి శరీరం కలవాడు" అని అర్ధం.  మరి రాముడు నల్లని వాడా, లేక బంగారం లాగ మెరిసే వాడా?  ఎందుకో ఈ భిన్నమైన భావాలు.  నా అనుమానము ఏమిటి అంటే, వేటూరి వారు రాసిన "ఇందు వదన, కుందరదన, మందగమన, మధుర వచన" పాట చాల ప్రసిద్ధి కదా? అందుకే, ఈ పాట లో కూడా, భావం తప్పినా, ఈ మాటలు వాడేసి వుంటారు.

ఇంకో భిన్నమిన భావం...............
ఆకాశం, భూమి కలిసే చోట సూర్యాస్తమయం చిత్రాలు చూడడానికి కన్నుల విందుగా వుంటాయి.  ఈ రెండు పాటలు గమనించండి. మొదటి పాట "ప్రేమ లేఖలు" చిత్రము లోనిది. 

నీకు నాకు పెళ్ళంట, నింగికి నెలకు కుళ్ళంటా
యుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసింది ఎపుడు లేదంట

రెండో పాట "బుర్రిపాలెం బుల్లోడు" లోనిది.

నింగి నేల కలిసిన చోట నిన్ను నేను పొందని
ఏ నాటిదో ఈ రాగమో ఏ జన్మదో ఈ బంధమో?

ఇంతకి కవి గారు ఏమని చెబుతున్నారు? నింగి, నేల కలుసు కుంటాయా? లేదా?

మరి ఇంకో భిన్నమైన భావం. 

మన తెలుగు సినీ కవులు, "మనసు" తో విపరీతముగ ఆడేసుకుని మనలని చంపేస్తుంటారు

మనసు గతి ఇంతే! మనిషి బ్రతుకింతే!!
మనసున్న మనిషికి సుఖము లేదంతే

ఆత్రేయ గారు పై వాక్యం రాస్తే, ఇంకో కవి గారు ఏమంటున్నారంటే

మనసు లేని బ్రతుకొక నరకం
మనిషికి  ఎక్కడ ఉన్నది స్వర్గం?

ఏంటో ఈ వ్యతిరేకమైన భావాలు? మనిషికి మనసు వుంటే బాగుంటుందా? మనసు లేక పొతే బాగుంటుందా?

సరేనండి.  వచ్చే సంచికలో, మళ్ళీ కలుద్దాం.