invisible hit counter
TeluguVani
కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ వుంటాయి –భైరన్

ఈ నాటి మన సంచిక మహానుభావుడు ఆచార్య వినోబా భావే

ఈ మధ్య కాలంలో మనం తరచుగా ‘పాదయాత్ర’ అనే పదాన్ని వార్తలలో వింటున్నాం. ఈ Vinoba Bhaveపాదయాత్రలు సాధారణంగా బడుగుజీవుల జీవన వెతలను వెలికి తీయడానికో, లేక రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళుటకో, లేక శారీరక, సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించుటకో చేస్తుంటారు. ఈ పాదయాత్రల ప్రహసనం, వాటి ప్రభావం, తదనంతర పర్యవసానాలు అందరికీ అర్ధమైనది కనుకనే ఆ మార్గాన్ని ఎంచుకొంటున్నారు. ఈ పాదయాత్రలకు స్ఫూర్తి, మన పూజ్య బాపూజీ, గాంధీ మహాత్ముడు. ఆయన అహింసా మార్గంలో చేసిన భారతదేశ పాదయాత్ర మనకు స్వతంత్రం తెచ్చిపెట్టింది. ఆయన స్ఫూర్తితోనే ఆయన అనుచరుడైన మరొక్క మహానుభావుడు తను కూడా పాదయాత్ర చేపట్టి, 72వేల మైళ్ళు నడిచి భూదాన్ ఉద్యమం ద్వారా, 13 సంవత్సరాలలో 42 లక్షల ఎకరాలను భూస్వాముల వద్దనుండి స్వీకరించి భూములులేని పేదవారికి పంచిపెట్టారు. అతనే భారతరత్న బిరుదాంకితుడు ‘శ్రీ వినాయక్ నరహరి భావే’, మనందరికీ పరిచయమైన ‘వినోబా భావే’.

సెప్టెంబర్ 11, 1895, మహారాష్ట్రలో జన్మించిన వినోబా భావే ఆలోచనలపై, చిన్నప్పటినుండి అమ్మ ప్రభావం ఎక్కువ వున్నందున తరువాతి కాలంలో అతను ఒక మంచి స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆధ్యాత్మిక గురువుగా అవతరించాడు. చిన్నప్పటి నుండీ  ప్రముఖ మరాఠీ ఆధ్యాత్మిక గురువులు మరియు వేదాంతవేత్తల పుస్తకాలు ఎక్కువ చదివేవాడు. తరువాత గాంధీజీ ఆదర్శాలకు ఆకర్షితుడై ఆయన అడుగుజాడలలో స్వాతంత్ర్య పోరాటానికి నడుం బిగించాడు.

బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. ఎంతో ఉన్నతమైన ఈ ఉపన్యాసాలను ‘టాక్స్ ఆన్ ది గీత’  అన్న పుస్తకంలో మనం చూడవచ్చు.

స్వతంత్రం సిద్దించిన తరువాత వినోబా భావే తన గుర్తింపు కొరకు, పదవుల కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు ఆరాట పడలేదు. తను చేయవలసిన, తనకు భగవంతుడు నిర్దేశించిన పని ఇంకా చాలా వుందని చెబుతూ, భారతదేశంలోని పల్లెలలో జీవించే సగటుజీవి పడుతున్న కష్టాలను కడతేర్చుటకు ఎంతగానో కృషిచేశారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడ భావించారు. ఈ ధోరణే క్రమేణా 'సర్వోదయ’ ఉద్యమానికి దారితీసింది. వినోబా భావే చేపట్టిన మరో మహోన్నత కార్యక్రమం - భూదానోద్యమం. ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతి భూకామందుని వ్యక్తిగతంగా కలిసి, పేద రైతుల కొరకు తను పడుతున్న తపనను అర్ధం చేసుకొని కొంతైనా భూమిని ఉచితంగా దానం చెయ్యాలని  ప్రార్ధించాడు. అలా సేకరించిన ఎన్నో వేల ఎకరాలను భూమిలేని పేద రైతులకు పంచి పెట్టాడు. అందుకే ఆయన ఎంతో మంది రైతులకు ఆదర్శమూర్తి అయ్యాడు.

వినోబా భావే చేపట్టిన మరొక సున్నితమైన అంశం, గోహత్య నిర్మూలనం. పశువులు కూడా మనలాగే ప్రాణమున్న జీవులు. పైగా మనకు ఎంతో సహాయకారులుగా వుంటాయి. అటువంటి గోమాతలను వధించడం అన్యాయం అంటూ ఎలుగెత్తి చాటాడు. అహింస, ప్రేమలను మేళవించిన ఆయన తత్వం మనందరికీ ఒక గీతోపదేశం వంటిది.

ఆగష్టు 2, 1959 న శ్రీ నగర్లో ఒక సమావేశంలో వినోబా భావే ఒక శాంతి సందేశాన్ని ప్రతిపాదించాడు. దానికి ఆయన ముద్దుగా ‘కాన్సెప్ట్ అఫ్ ABC ట్రైయాంగిల్’ అని పేరుపెట్టాడు.  A అంటే ఆఫ్ఘనిస్తాన్, B అంటే బర్మా (మయన్మార్) C అంటే సిలోన్ (శ్రీలంక). ఈ త్రిభుజంలో వున్న దేశాలన్నీ అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్,  నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, భారతదేశం ఒక కూటమిగా, సమాఖ్యగా ఏర్పడితే, ఆ హిమాలయాల సాక్షిగా అంతా ప్రశాంతమే. ఈ శాంతి ప్రతిపాదన ఆ రోజుల్లో ఎంతో మందిని ఆలోచింపచేసింది. అంతేకాక మరొక్క సందేశంతో ‘శాస్త్రీయ విజ్ఞానం + ఆధ్యాత్మికము వెరసి సర్వోదయం అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం. కాకుంటే  శాస్త్రీయ విజ్ఞానం + రాజకీయాలు వెరసి అంతా వినాశం.  ప్రస్తుతం మనం రెండవ కలయికే ఎక్కువగా చూస్తున్నాం. అందుకే శాంతియుతంగా జీవించలేక సతమతమౌతున్నాం.'  ఈ సందేశం ఎందఱో పట్టభద్రులు అతని సూత్రాలను ఆదర్శంగా తీసుకొని అతని బాటలో నడిచేటట్లు చేసింది.

ఒకప్పుడు చంబల్ లోయ పేరు వింటేనే అందరికీ నిద్రపట్టేది కాదు. ఎందుకంటే అది బందిపోట్లు నివసించే ప్రాంతం. ఆ ప్రాంతానికి వినోబా భావె 1960 వ సంవత్సరంలో వెళ్ళాడు. “భగవంతుడు ఈ బందిపోట్ల మెదడులను మార్చేశాడు.  పుట్టుకతోనే ఎవ్వరూ బందిపోటు కారు. పరిస్థితులే వారిని మార్చాయి” అని తన అంతరాత్మ చెబుతున్నట్లుగా భావించి వారిని పిలిపించి వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి జైలు వెనుక భాగంలో అందరితో కలిసి ప్రార్ధనలు చేశాడు. హింసను రూపుమాపాలంటే అహింసే సరైన మార్గమని, ఆ దారిలోనే వారిని మార్చేందుకు ప్రయత్నించాడు.

గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ధ్యేయంగా సర్వోదయ ఉద్యమం ద్వారా ఆచార్య వినోబాభావే అలుపెరుగక పనిచేశాడు. మన తెలంగాణాలోని పోచంపల్లి ఆ భూదానోద్యమానికి ఒక కేంద్ర బిందువైనది. అది తెలుగువారమైన మనందరం గర్వించదగ్గ విషయము. 

దురదృష్టవశాత్తూ, వినోబా భావే శ్రమటోడ్చి చేసిన ఈ భూదాన్ ఉద్యమం ప్రస్తుత రాజకీయ నాయకుల జోక్యంతో తప్పుదార్లు తొక్కుతున్నది. భూదాన్‌ భూములను తవ్వేకొద్ది పెద్దసార్లు ఎదురవుతున్నారు. భూదాన్‌ భూములు పెద్దోళ్లకు వరంగా మారిపోయాయి. ఒకప్పుడు పేదోడి కోసం కాళ్లకు బలపం కట్టుకుని వినోబా భావే భూములు సంపాదిస్తే, ఇప్పుడు వాటిని కాళ్లు కదపకుండా కొందరు బడాబాబులు దర్జాగా అనుభవిస్తున్నారు. భూదాన్ భూముల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే వాటిని సొంతం చేసుకుంటున్నారు. ఒకాయన కూతురు పేరుతో భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే, మరొకాయన తన భార్య పేరు మీద ఆ భూములను ఆక్రమించుకొన్నాడు.  మనిషి ఆలోచనలు పరిస్థితుల ప్రభావంతో ప్రక్కదారి పడితే అంతా వినాశం కాక మరింకేటి.

భూదానం ద్వారా పేద రైతులకు చేయూత నిచ్చిన వినోబా భావే, ఆధ్యాత్మిక, అహింసామార్గాలు పనిముట్లుగా సమాజసేవ, గోరక్షణ, కుష్టు వ్యాధిగ్రస్థులకు సహాయం, ఇలా ఎన్నో సేవలను అందించి వివాదం లేని పరమాచార్యులుగా పేరుగడించారు.  బ్రహ్మ విద్యామందిర్ ఆశ్రమం ద్వారా ఎంతోమంది మహిళలు తమ స్వయంకృషితో జీవితంలో స్థిరపడేందుకు ప్రోత్సహించాడు.

ఆచార్య వినోబా భావే 1982 నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, కీర్తిశేషులైనారు.

1958 లో వినోబాకు రామన్ మాగ్సేసే పురస్కారం లభించింది. ‘సామాజిక న్యాయకత్వం’ వర్గం లో ఈ పురస్కారం అందుకొన్న మొట్టమొదటి వ్యక్తి మన భారతీయుడు, వినోబా భావే కావడం మనం గర్వించదగ్గ విషయం. 1983 లో ఆయనకు భారతరత్న బిరుదుని బహూకరించారు.

ఎంతో స్ఫూర్తితో సమాజ అభ్యున్నతి కొరకు తన జీవితాన్నే ధారబోసిన ఆ మహనీయుని మరొక్కసారి మనసారా స్మరించుకుందాం.

 

మూలం: Vinobabhave.org, iloveindia.com