Teluguvaani | A monthly Telugu magazine
TeluguVani
కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ వుంటాయి –భైరన్

చిన్నారి కథలు

కాశీ చెంబు

- వి వెంకటరావు

ఎండలో తళ తళ మెరుస్తున్న ఇత్తడి, రాగి పాత్రలకేసి ఒక్కసారి తృప్తిగా చూసుకొని, ఆఖరి డేగిశా గోడకి బోర్లించింది మామ్మ. ఎదురుగా కాఫీ తాగుతున్న మనవడి కేసి చూసే సరికి, ఒళ్ళంతా చెమటలు కక్కుతున్న మామ్మకు ఒళ్ళు మండిపోయింది.

“అలా ఎదురుగా కాఫీ మింగకపోతే కాస్త సాయం చెయ్యవచ్చుగా. ఇంట్లో పనులన్నీ బాగానే చేసుకుంటావు. ఇక్కడికి వచ్చేసరికి ఏం రోగం వస్తుందో నీకు” మనవడి ముఖంమీదే అంది.

“ఇలాంటి పనికి మాలిన పనులు చెయ్యనని ఎన్నిసార్లు చెప్పాలి. అడ్డమైన పనులన్నీ చేసుక్కుర్చుంటే నా చదువు సంగతేంటి”.

“ఏంటీ? ఇవి పనికి మాలిన పనులా? తర తరాలనుండి మన ఇంట్లో వున్నాయి. నేను ఈ వూరు వచ్చినప్పటి నుండీ వున్నాయి. మా అత్తగారు ఇలాగే అన్నింటినీ కడిగి శుభ్రం చేసేది. దాన్నేగా నేనూ పాటిస్తున్నాను. ఇంట్లో వస్తువులన్నీ నీకు పనికి మాలినవిగా కనిపిస్తున్నాయా?”

“అన్నీ అని ఎవరన్నారు? ఏ ఉపయోగం లేకుండా అటక మీద పడివున్న వాటి గురించి నేననేది”.

“ఇత్తడివీ, రాగివీ ఇవన్నీ నీకు పనికి మాలినవిగా కనిపిస్తున్నాయా? వాటికేం ఎప్పుడమ్ముకున్నా డబ్బులే. ఆ ఇనప ముక్కలకేం వస్తాయి. పాత సామాన్లోడికి తప్ప”.

‘ఇనుప ముక్కలు’ అని స్టీలు పాత్రలనే అంటుందని ఆ మనవడికి తెలుసు. “ఏం ఇనుప ముక్కలు వాడుకోవడం లేదూ. రోజు అన్నం మరి ఎందులో మింగుతున్నావు. తెల్లవారి లెగిస్తే వాడుతున్న సామాన్లన్నీ చెడ్డవి. ఏ మాత్రం ఉపయోగం లేకుండా అటక మీద పడి వున్న సామాన్లు మంచివి. అసలు సామాన్లు ఎందుకు తయారవుతాయో తెలుసా? మనలాంటి వాళ్ళం వాడుకోవడానికి. అంతేగానీ అమ్ముకుంటే డబ్బులొస్తాయని కాదు. అలంకారానికీ కాదు”.

“ఎందుకు వాడుకోం. ఇంట్లో ఏదైనా కథాకార్యాలు అయితే అప్పుడెవరి దగ్గరికి పరిగెడతాం. పదిమందికీ వండాలంటే నీవు ఎనకేసుకొస్తున్న ఇనుపముక్కలు పనికొస్తాయా?”

“కథాకార్యాలు రోజూ వచ్చేస్తాయా? పోనీ నెలకి ఒక్కసారైనా వస్తాయా? ఎప్పుడో ఏ నాలుగేళ్ళకో తోమి, ఒళ్ళంతా చెమటలు పట్టేసినట్లు శ్రమపడిపోవడం ఎందుకు? ఆ ఒక్క రోజుకి ఏ సప్లయర్స్ నుంచో అద్దెకి తెచ్చుకుంటే సరిపోదా?” అని మనవడు మాట్లాడేసరికి మామ్మ మరి మాట్లాడలేదు.

“సురేషూ! కాలేజీకి వెళుతున్నట్లున్నావు. నన్ను కాస్త బ్యాంకు దగ్గర దిగబెడుదూ. పెన్షన్ డబ్బులు తెచ్చుకోవాలి”.

మామ్మని వెనుక కూర్చోమని, ఇద్దరు బ్యాంకుకి వెళ్ళారు. ఫస్ట్ తరువాత రోజులు. చాలా మంది ముసలివాళ్ళున్నారు. వచ్చిన పని వేగిరం అయ్యేటట్లు లేదు. మధ్యాహ్నం భోజనం టైము కూడా దాటి పోయేటట్లుంది. ఎందుకైనా మంచిదని దగ్గరలోనే ఒక బిస్కెట్ పాకెట్, వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చి కాలేజీకి వెళ్ళిపోయాడు.

మధ్యాహ్నం ఒంటి గంటకు గానీ డబ్బులందలేదు. రిక్షా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది మామ్మ. ఇంటికి రెండు తాళం చెవులుంటాయి. ఒకటి మామ్మ దగ్గరా, ఒకటి మనవడి దగ్గరా. ఇంటికి చేరుకొని, తాళం తీసి లోపలి వెళ్లేసరికి ఒక్కసారి గుండెలు గుభేల్మన్నాయి. ఇంట్లో సామాన్లు లేవు. అమ్మ బాబోయ్ దొంగలు పడినట్లున్నారు. “దొంగలు! దొంగలు!” అంటూ కేకలు పెట్టింది. దొంగలు అనే మాట చెవిన పడేసరికి, ఆ చుట్టుపక్కల వాళ్ళు, దారిన పోయేవాళ్ళు అందరూ పోగయ్యారు.

ఇంతలోనే మనవడు వచ్చాడు. వచ్చిన మనవడు “దొంగలు లేరు. ఎవరూ లేరు” అంటూ చుట్టూ చేరిన వాళ్ళని వెళ్లి పొమ్మన్నాడు.

మామ్మకి గాభరాగా ఉంది. ప్రశాంతంగా చెప్పాడు. “నువ్వు ఇంట్లో ఉన్నప్పుడైతే ఒప్పుకోవని, నేనే ఆ పాత పనికిరాని తపేళాలు, డేగిశాలు అమ్మేశాను”

“ఏంటీ అమ్మేశావా? అవేం చేశాయి నీకు వాటి మీద పడ్డావేం?”

“సంవత్సరాని కొకసారైనా నీవు పడుతున్న శ్రమ చూడలేక అమ్మేశాను. ఇంట్లో సామాన్లు తగ్గితే పని కూడా తగ్గుతుంది కదా! మామ్మ! అసలు నీకో విషయం చెప్పనా? ఏ వస్తువైనా ఎందుకు తయారవుతుంది. మనం వాటిని వాడుకోవడానికి. మనం కాకపోతే ఇంకొకరో, ఇంకొకరో వాడేసుకోవాలి. లేకపోతే అవి కొన్నాళ్ళకి వాడుకోవడానికి పనికిరాకుండా పోతాయి. దుమ్మూ ధూళితో ఒక మూలన పడి ఉండడం ఎందుకు. మన పాత్రలే కాదు. ఏ వస్తువైనా అంతే. ఎవరూ ఉపయోగించకపోతే, వస్తువులు నిలువ ఉండడం వలన ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఈ విషయాలు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. నువ్వున్నప్పుడైతే ఒప్పుకోవని నేనే ఈ పని చేశాను” అని అన్నాడు.

కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుంది మామ్మ. పూర్వం సామాన్లు ఒక్కసారి చూసైనా చూసుకున్నాను కాదు” అని గొణుక్కుంటుంటే...

“ఎందుకు మరీ అంత బాధపడతావు మామ్మా! నీవిలా బాధపదతావనే తీసుకెళ్ళే ముందు అన్నింటినీ ఫోటోలు తీయించాను. సామాన్లు జ్ఞాపకం వచ్చినపుడల్లా ఆ ఫోటోలు చూసుకో. అయినా నీ సామాన్లు ఎక్కడికీ పోలేదు. భద్రంగానే ఈ డబ్బు రూపంలో వున్నాయి” అంటూ డబ్బు అందించాడు.

“మా అత్తగారు కాశీనుండి తెచ్చిన కాశీ చెంబు అది కూడా” అంటూ నెమ్మదిగా అంది.

“అదా! అది అమ్మలేదులే. అయినా పనికి రాకుండా అటక మీద పడివున్న వస్తువులని అమ్మేశానుగానీ, మనం రోజూ వాడుతున్న చెంబుని అమ్మేస్తానని ఎలా అనుకున్నావు మామ్మా” అంటూ ఆ చెంబును అందించాడు.

కాశీ చెంబును చూడగానే ఒక్కసారి కళ్ళు ఆనందంతో మెరిశాయి మామ్మకి.

(నానీ సౌజన్యంతో )