invisible hit counter
TeluguVani
కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ వుంటాయి –భైరన్

ఈ నెల తెలుగువాణి లో నల్గొండ జిల్లాకి సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. నల్గొండ జిల్లా తెలంగాణా జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా ముఖ్యపట్టణం నల్గొండ. పూర్వం  శాతవాహనుల కాలంలో ఈప్రాంతం నీలగిరి గా ప్రసిద్ధి చెందింది. పిదప నంది కొండ గా పిలిచేవారు. తరువాత కాలక్రమేణ నల్లగొండగా మారింది. ఈ జిల్లా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం లో ప్రముఖ పాత్ర వహించింది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా  పేరొందింది. 

ఈ జిల్లాకు సరిహద్దులుగా ఉత్తరాన మెదక్ జిల్లా మరియు వరంగల్ జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాలో కొంత భాగం ఉండగా తుర్పున ఖమ్మం మరియు కృష్ణా జిల్లాలు, పశ్చిమాన రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాలున్నవి. ఈ జిల్లాలో గల నదులు చూసినట్లయితే కృష్ణా నది, మూసీనది, ఆలేరు, పెద్దవాగు, దిండి, మరియు పాలేరు నదులు ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లాలో రెండు ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు కలవు. ఒకటి నాగర్జున సాగర్ రెండవది ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు. ఇంతకు మునుపు దీనినే శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టు అనేవారు. ఈ జిల్లాలో చూడవలసిన ఆకర్షణీయమైన ప్రదేశాలు చాల ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రదేశాలను గురించి తెలుసుకుందాము.

హైదరాబాదుకు నూటయాభై  కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్  ఈజిల్లాలో ఒక ఆకర్షణీయమైన  పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మక ప్రదేశానికి నాగార్జున అనే పేరు క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుడి కారణంగా వచ్చింది. ఆయన పేరుతో కృష్ణా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ  1955 లో ప్రారంభించాడు. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే ఎక్కువ ఎకరాల సాగుబడి జరుగుతుంది. ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన పురాతన అవశేషాలు బయటపడ్డాయి. ఆ పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద భద్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద నుంచి బోటు సేవలు లభ్యం ఔతాయి. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేషాలైన స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి. అలాగే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది.

హైదరాబాదు రహదారి సమీపములో సుమారు నూటయాభై కిలోమీటర్ల దూరంలో విజయపురి వద్ద చంద్ర వంక జలపాతము కలదు. ఈ జలపాతము ఎత్తిపోతల జలపాతమునకు ఇంచుమించు పదకొండు కిలోమీటర్ల దూరంలో నాగార్జున కొండకు ఇరవైఒక్క కిలో మీటర్ల దూరములో కొండల మధ్యలో కలదు. ఈ సుందర జలపాతము అరవై  మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ సుందర జలపాతాన్ని చూడటానికి  అనేకమంది పర్యాటకులు ప్రతి యేటా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ కొండ గుహలలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయని ప్రసిద్ది. ఇక్కడ ధ్యానం చేసిన  ఒక యతీంద్రుని వల్లనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. అలాగే నందికొండ ప్రాంతములోని కోటను పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. నంది కొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిర్యాలగూడకు సుమారు అరవైఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బుఱుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార అటస్థలం ఉంది. ఇంకొకటి పోచంపల్లి. ఇక్కడే ఆచార్య వినోబా భావే తన ఉద్యమాన్ని మొదలు పెట్టారని చెబుతారు. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపేట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన ఆలయాలు ఉన్నాయి.  ప్రాచీన తెలుగు కవి పిల్లలమఱ్ఱి పిన వీరబద్రుడు పుట్టిన ప్రదేశం ఇదేనని ప్రతీతి. ఈ ప్రాంతం లో కొలను పాక  చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. ఇది హైదరాబాదుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరం లో ఉంది.  ఈ ప్రదేశంలో సువిశాలమైన  చారిత్రిక ప్రసిద్ది చెందిన కోట ఉంది. ఈ కోట పదకొండవ శతాబ్దం కళ్యాణి చాళుక్యుల నాటి కోట. ఆ కోట శిధిలాలు ఇప్పటికీ ఉన్నాయి కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.

ఈ జిల్లాలోని యాదగిరి గుట్ట ఆలయం, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఈ కొండ నల్గొండ లోని భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉన్నది. మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి గాఢ తపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది.

ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము వాడపల్లి తీర్ధం. శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. ఇది కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం.ఇంకా చూడవలసిన ప్రదేశాల లో  రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి, మటంపల్లి, పంగల్, సుంకిశాల, త్రిభువన మల్లన్న నిర్మితమైన భువనగిరి  కోట ఉన్నాయి. ఈ కోట  రుద్రమదేవి ఆమె మనుమడు  ప్రతాపరుద్రుని పాలనలో కూడా ఈ కోట ప్రస్తావన ఉన్నది.

ఈ జిల్లా అనేకమంది మహానుభావులకు జన్మభూమి. ఉద్యమాలకు పెట్టనికోట గా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు, ప్రముఖ గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ప్రముఖుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.

ఇవండీ నల్గొండ జిల్లాకు సంబంధించిన కొన్ని వివరాలు .  అక్కడక్కడ మేము వికీ పీడియాన్ని కూడా ఆధారంగా చేసుకొని వివరాలను సేకరించాము. వచ్చే నెలలో మరో జిల్లా విశేషాలు తెలుసుకుందాము.

Images Courtesy: Wikipedia, Chai Biscuit