Teluguvaani | A monthly Telugu magazine
TeluguVani
కష్టాలలోనే కటిక నిజాలు బోధపడుతూ వుంటాయి –భైరన్

తండ్రి


- మధుప్రియ


తండ్రి అనే పదంలో తరిగిపోలేని భాధ్యతలెన్నో, భక్తి భావాలెన్నో
ఈ సువిశాల ప్రపంచములో తండ్రి అనే పిలుపుకి ఎన్నో పర్యాయపదాలు
పిలుపు ఏదైనా అందులోని ప్రేమ ఒక్కటే,
భాష ఏదైనా, భావమేదైనా, భాష్యమొక్కటే
నాన్న అంటే జీవితం అనే నావను నిర్దేశిస్తూ నడిపే నావికుడు

కష్టనష్టాలనే ఆటుపోట్లను ఎదుర్కొంటూ,
వాంఛలు, భావోద్వేగాలు అనే అలలతో అల్లకల్లోలమైన
సంసార సాగరాన్ని దాటి సుదూర, సుమధుర తీరమైన జీవితాశయానికి చేర్చే సంకల్పవాది
తన కుటుంబము యొక్క బంగారు భవిష్యత్తు కొరకు నిరంతరము శ్రమించే  శ్రామికుడు
తల్లితండ్రులను అవసానదశలో అన్నివేళలా ఆదుకొనే తనయుడు

అన్ని పనులలో ప్రావీణ్యము కలిగి
జీవిత భాగస్వామికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం ప్రేమించే భర్త
పిల్లలకు నిరంతరం సంరక్షణ నిచ్చి, మంచి స్నేహితుని వలె  ఉండి సంస్కారాన్ని నేర్పే తండ్రి
సాటి మనిషికి సహాయపడుతూ, సామాజిక కర్తవ్య నిర్వహణలో ముందుండే మగవాడు-మనవాడు
యిన్ని బాధ్యతలను గుర్తెరిగి వాటి నిర్వహణలో సతమతమౌతూ గృహస్థాశ్రమాన్నిమనసావాచా మనోల్లాసముతో నిర్వర్తిస్తూ సదా మన వెన్నంటి వుండే ఆ ఆదర్శమూర్తికి
ఈ పితృదినోత్సవ సందర్భంగా మనః పూర్వకముగా అభినందనలు తెలియచేద్దాము